అర్జున తరంగాలు .... నా అంతరంగాలు

 నేను ఎవ్వరు? 

ఏవండోయ్ లేవండి.. భార్య పిలిచినట్టనిపించింది.. కాదు...కాదు అరిచినట్టనిపించింది..  

మగతగా కళ్ళు తెరిచీ తెరువక (నిలుపుతూ) ఏమిటోయ్ శ్రీమతి గారు అరుస్తున్నారూ?? ...అందాం అనుకున్నంతలో... స్వరం కొద్దీకొద్దీగా మారి.. మగ గొంతుక అయింది.. నన్ను నిద్రలేపే మగ పురుషులు (శ్లేష కోసం వాడాను) ఎవరబ్బా అనుకుంటూనే.. ఇదేదో తెలిసిన గొంతులా ఉందే... అని ఎంత ప్రయత్నించినా ఎదురుగా అద్దం పక్కన కుర్చీలో ఉన్న ఆకారం స్పష్టంగా కనిపించలేదు.. 

ఎవరండీ మీరు.. అడిగాన్నేను ... 

అవును సరైన ప్రశ్నే.. నేనెవరో చెప్పేముందు.. మీరెవరో చెప్పండి.. .... 


ఇదేంటి.. ప్రశ్నకు, ప్రశ్న సమాధానం..? నా ఇంటికి వచ్చి నన్నే నువ్వెవరు అని అడుగుతున్నారు? ఐనా  ఇదేమి ప్రశ్న?.. రెట్టించిన గొంతుకతో అడిగాన్నేను 

అవతలనుండిఅవునవును .. ఇదేమి ప్రశ్న.. కొంచం వెటకారం ధ్వనించింది.. సమాధానం కావాలా….? ఐతే వినండి .. (నా అంగీకారంతో నిమిత్తం లేకుండా.... చెప్పుకుపోవటం మొదెలెట్టాడు..) 


మనకి ఎవరైనా కొత్త వ్యక్తులు ఎదురుపడితే సర్వ సాధారణంగా అడిగే మొదటి ప్రశ్న ఏది?  

తెలిసిన వారైతే - ఎలా ఉన్నారు? 

మరి తెలియనివారైతే - ఎవరు మీరు? 

నాకు తెలిసి ఈ రెండు ప్రశ్నలు ఎదుటి వారి మంచి చెడ్డల గురించి తెలుసుకోవడానికి మొదటి మెట్లుగా పనికివస్తాయి 

వీటిలో ఒకటి అడిగి, లేదా రెండూ అడిగి.., మీకేమి కావలి, ఎలా సహాయపడాలి, ఎందుకు మనతో మాట్లాడుతున్నారో, ఏమి ఆశిస్తున్నారో, ఏమి నేర్చుకుంటున్నారో లేదా నేర్పుతున్నారో అని రకరకాల ప్రశ్నలతో వివరాలను విచారిస్తాం.  


ఇవన్నీ నాకెందుకు చెబుతున్నారుచిరాకుగా అన్నాన్నేను!! 

చెబుతున్నాను ఆగండి.... తొందరెందుకు.. అదే విసుగు తెప్పించే ధోరణి.. 


ఎదుటి వ్యక్తి గురించి మనం తెలుసుకున్నదానికి, కొంత ఊహలు, ఊహాగానాలు చేర్చి వారిని గురించి బేరీజు వేస్తాం. వారి అవసరం గురించి కాక, మనకు భవిష్యత్తులో ఎలా ఉపయోగపడతారో అని ఆలోచించి ముందడుగేస్తాం. మొత్తం అందరం ఆలా అని కాదు కానీ, నూటికి  80% అంతే అంటే అతిశయోక్తి కాదేమో!!..  

ఇదే సమాజ పోకడ.  ఎవరు మీరు అనే ఈ ప్రశ్న వల్ల మనిషికి, సమాజానికి ఏంతో  కొంత లాభం కూడా లేకపోలేదు. కానీ మనస్సుకు కలిగే ప్రయోజనం మాత్రం  శూన్యం అని నా భావన.  

నా దృష్టిలో ప్రతి మనిషి జీవితంలో తనను తాను అడగాల్సిన, సమాధానం వెతకాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న:  నేను ఎవరు  


ప్రశ్నకు సమాధానం అంటూ .. మరో ప్రశ్నా ? ఆలోచించడం మొదలు పెట్టాన్నేను 


ఇంతకూ ఎవరు నేను?- ఇదేమి ప్రశ్న!! అనుకుంటున్న నాకు....... అదేదో ఒక ప్రముఖ తెలుగు చిత్రంలో (సినిమా) ఒక పాత్ర చేత దర్శకుడు ఇలాంటి ప్రశ్నలే  అడిగించాడు కదా!? అని గుర్తుకు వచ్చింది.. ఆ పాత్ర ఎదుటి వ్యక్తిని "నువ్వు ఎవ్వరు" అని అడుగుతూనే ఉంటుంది. సమాధానాలు ఎన్ని మారినా, ప్రశ్న మాత్రం మారదు! చిన్నప్పుడు అది ఒకింత హాస్యాన్ని పంచిన విషయం నిజమే! 


అలాగే మరో తెలుగు చిత్రంలో, ఒక ప్రముఖ గీత రచయిత ఇలాంటి ప్రశ్ననే కొంత భారంగానే వ్రాశారు అనిపించింది... ఆ పాట పల్లవి, "Who are you, జరా దిల్ సే పూచో ......... ,  Who are you" తో మొదలై, మరి కొన్ని ప్రశ్నలను సంధిస్తుంది.  


హాస్యభరితంగా అడిగినా, భారమైన భావంతో అడిగినా, ఇదో ముఖ్యమైన, సమాధానం వెతకాల్సిన ప్రశ్న అని ఇప్పుడు నాకనిపిస్తోంది.. చిత్రంలో ఒక సన్నివేశం గానో, ఒక పాట గానో మాత్రమే చూడక, ప్రతి ఒక్కరు తమని తాము అడగవలసిన ప్రశ్న... 


                              "నేను ఎవరు" 


నాకు నేను అర్థం కానంతవరకు, నాకు ఈ సమాజం అర్థం కావడం లేదు అనుకోవడం సరి కాదేమో. సమాజం అర్థం కావాలంటే, మనల్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి. అందరూ విన్న ఒక తెలుగు సామెత ప్రకారం, "ఇంట గెలిచి, రచ్చ గెలవాలి". 


ఈ సామెతలో వెతకాల్సిన నిగూఢ అర్థం ఉందో లేదో కానీ, తరచి చూస్తే, ఈ సామెతలో నాకర్థం అయ్యింది "నిన్ను నువ్వు తెలుసుకుంటే, సమాజం నీకు అర్థం అవుతుంది". మనల్ని మనం అర్థం చేసుకోవటంకంటే గొప్ప గెలుపుంటుందా 


ఇలా ఆలోచిస్తున్న నాకు.. ఎక్కడో దూరంనుండి వినిపిస్తున్న లలితా సహస్రనామంలోని... ఈ రెండు పంక్తులు.. ఎప్పుడూ విన్నవే  ఐనా .. కొత్తగా అర్థం అవుతున్నట్టు అనిపిస్తున్నాయి..  


"అంతర్ముఖ సమారాధ్యా 

బహిర్ముఖ సుదుర్లభా " 

 

దైవత్వం అర్థం కావాలన్నా / అనుభవం లోకి రావాలన్నా సమాధానం వెతకాల్సిన ప్రశ్న - "నేను ఎవ్వరు" 

 

ఇదేంటి నా ఎదుటి వ్వక్తి నా సమాధానం వినకుండానే, దూరంగా వెళ్ళిపోతున్నాడు. 


మాస్టారు.. గట్టిగా.. అరుద్దామని ఎంత ప్రయత్నించినా.. మాట రావడ లేదు..  


ఇంతలో.. మాస్టారు.. ఏంటి కలవరిస్తున్నారు. బానే ఉన్నారా? మళ్ళీ శ్రీమతి గొంతు వినిపించింది.. 


అంటే ఇంత సేప కలకన్నానా!!!!.. నేను బానే ఉన్నానా?.. 

నాకు సమాధానం వెతకాల్సిన ఇంకో కొత్త ప్రశ్న ఎదురైంది..... 

 

అర్జున కవనం®